29, ఏప్రిల్ 2009, బుధవారం

నీ కోసం కలవరిస్తూ

నీ వెచ్చని స్పర్శ నీ తీయని నవ్వు మిలమిల లాడే నీ
నవ్వే కళ్ళు నా ఎదురుగా నిలిచి నా నిద్రని దూరం చేసాయి
చల్లని సాయంత్రం నీవు నా వెంట నా మనసు నీ వెంట
కలిసి మనం పంచుకున్న క్షణాలన్నీ వెన్నెల వెలుగులో
కలిసి పోయి చీకటి నీడల మాటున మౌనంగా ఆగాయి
నేను మాత్రం నీడల ఊడలని ఊపి వాటిని ఏరుకుందామని
నీ కోసం కలవరిస్తూ వేయి వెర్రి ఆశలతో నిలుచున్నా

27, ఏప్రిల్ 2009, సోమవారం

ఎద లోపలి సడులన్నీ

ఎద లోపలి సడులన్నీ ఒదిగి వినాలనివుందా
విని చూడు ఏ క్షణమైనా నీ తలపే నా గుండె
లోపలి జ్ఞాపకాల పొరలలో కదిలి కదిలి నా
మది గదిలో ప్రతి మూలా నీ రూపే నిలిచిందని
నీకు తెలిసే సరికి కాలం తన ప్రవాహంలో
మన యిద్దరినీ తెలియని తీరాలకు తోసుకుపోతుంది

చిటికెడంత ముద్దు

మనసులోని మాటలన్నీ కమ్మని తెమ్మెరగా నన్నూ
నా ఆలోచనలనీ వెతికి వెతికి కమ్ముకున్నాయి
చిరు చీకట్లలో చిటికెడంత ముద్దు నన్ను తాకిందని
నేను తేరుకునే లోగా నీ నవ్వుల వాన, నీ మాటల
మధిరిమలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసాయి ఇంతలో
నన్ను ఓ వరం మెరుపులా తాకింది నీ చారెడు కళ్ళు
నన్ను వెనకనుంచి జ్ఞాపకాల వలతో పట్టేసాయి

22, ఏప్రిల్ 2009, బుధవారం

మది గదిలో

ఇద్దరి మధ్యా ఇంతటి దూరం అవసరమా?
మన మనసులు మాట్లాడుకోవా?
ఎవరో నిర్మించిన చట్రాలలో ఇమిడి
మరెవరో కలిగించిన కష్టాలను తడిమి

పదాలను వెదికి పెదాల వెనుక దాచి
పలకరించాలని వున్నా వేరెటో చూసి
మది గదిలో బందీగా నేను మళ్ళీ
ఇంతటి సమూహంలో ఎప్పటిలాగే ఒంటరిని

కలను రమ్మననా

ఎందుకు నీ ఆలొచన నన్ను ఇలా తరుముతోది
నిన్న నే చూసిన కలా? లేక ఈరొజు నాకు అందిన
అందమైన సహసంభాషణ సహచర్యమా
నాలో ఏమిటీ మార్పు నీవేఅంతా అనే ఆలోచన
మనసులో మాటలో పదములో పెదవులో
అడుగడులో మరీ మరీ నీ ఆలొచన ఎమీ
రేపు నీ సుందర రూపం ఎలా చూడను?
నా నిద్రను కాజేయమని నా కలను జయించమని
మనసులో మధురంగా ఉన్న నీరూపం నాతోనే
అనుకుంటూ నిద్రను కోరనా, కలను రమ్మననా

నాకు కలలు కావాలి

కనురెప్పలారా మూత పడండి
కలలోకూడా నా చెలిని చూడనివ్వండి
రేపు మళ్ళీ నా చెలిని చూడాలంటే
ఆ నవ్వుల గలగలలు వెన్నెల మధురిమలు
నా గుండెల నిండా నింపుకుని ఓ చిన్న కలని
మనసారా నేను ఆహ్వానిస్తా పరిమళాలతో

21, ఏప్రిల్ 2009, మంగళవారం

నా ఆలోచన నీ చుట్టూ కదుల్తోంది

నా మనసుని ఎందుకిలా వేధిస్తావు
నా కలలని ఎందుకిలా కాజేసావు
నా ఆలోచన నీ చుట్టూ కదుల్తోంది

ఒక క్షణం నీ రూపం మరో క్షణం నీ
మాట ఇంకో క్షణం నీ పాట నేను
నీ గూర్చి ఆలోచించని క్షణం నా
పలుకు నా ఉలుకు నీ చూపు కోసం

నమ్మావా ఆ రోజు నీ కళ్ళు అనుక్షణం
నాతో మాట్లడుతాయంటే తెలిసిందా
నీ చూపుల భాష నాకు మాత్రమే తెలుసనీ

పదాలన్నీ నీ పెదాల మాటున దాచి
కలలన్నీ నీ రెప్పల చాటున వుంచి
వదలలేక కదలలేక నీ అడుగు
కదిలిందనీ నాకు తెలియదా

ఓ కొత్త ఉదయపు ముద్దు కోసమేనా?

నిద్ర నాకెందుకు రాదు? నీకు తెలుసో లేదో
కలలకు రెప్పల ముద్దు కావాలి
రేయికి వెన్నెల ముద్దు కావాలి
సంద్రానికి తీరపు తడి శ్వాస కావాలి

మరి నాకో
నీ వెచ్చని ఒడి కావాలి మరి నీ నవ్వు కావాలి
నీ చేయి తగిలిన స్పర్శ నన్ను వెంటాడుతూందని
నీకు గానీ నీ మనసుకు గానీ ఏనాడైనా
తోచిందా మరి తోచినా .... దాచావా?
నే అడగని వరం నాకై వచ్చినప్పుడు నా హృదయం
నీ చప్పుడూ నీ నవ్వూ నీ మాటా పాటా
నా మది గదిలో దాచిన నీ వలపు తెరలు
ఏనాడైనా మన మధ్య ఓ కొత్త పరిమళాన్ని
సరికొత్త భావలను ఇస్తాయని నాకు తెలుసు
ఎందుకీ క్షణాలు నన్నూ నా నిద్రనూ నీ నుంచి
దూరం చేస్తున్నాయి? ఓ కొత్త ఉదయపు ముద్దు కోసమేనా?


నేను నీవు గాక మరేమిటి

నీ ఆలోచననల ప్రవాహం నన్ను ఇలా
మోసుకుపోనీ నీ ఊహల తీరం వరకూ
నీ కన్నుల చూపుల వలలో నన్ను లాగు
నీ మది గది వరకూ, కారణం నీ మాట
నీ పాట అని నే నీగూర్చి పలికే వరకూ

నాకు నువ్వు కలలో అందిన ఓ
అందాల సుందరివి , నీ గూర్చి
నేను ఏనాడైనా ఎప్పుడైనా
తప్పుగా తలచానా నీకు నా
ఆలోచన మీద ఎందుకు
అనుమానం... నా మీద నీకున్న
నమ్మకం గూర్చి... నీ ఆలోచన

ఆ సాయంత్రం నీ కౌగిలి కావాలన్నాను
నీ పెదవి మధురిమ కావాలన్నాను
నీ దగ్గరి తనాన్ని... నీ ముద్దునీ
నేను కోరాననీ... నీకు కోపమా
అనుక్షణం నీ ఆలోచన నా మదిని
తొలుస్తూవుంటే నేను నీవు గాక మరేమిటి

మనమిద్దరమే

నీతో ఉన్న కొన్ని క్షణాలు నన్ను నేను మరచిన సమయం
నీవు అలా నా పక్కనున్నంత కాలం నాకు ఏమీ తోచదు
నీ చేతులు నన్ను వెదికినప్పుడు నాలో ఏదో మార్పు
అదేమిటో నాలో ఇన్నాళ్ళూ దాగిన కోరిక రెక్కలు విప్పింది
నీ అందాలన్నీ అందుకోవాలని నాకు ఆశ కలిగింది
నీకూ నాకూ అలా దూరం లేని క్షణాలు దగ్గరగా వున్నాయా?



నువ్వలా ఒదిగి పోతే నీ చనువు సాహచర్యం అందించే వెచ్చదనం
మరెక్కడైనా వుంటాయంటే నేనెలా నమ్మేది? ఈ చిన్న మెరుపు చాలు నా జీవితానికి
కొన్ని జన్మలకు నేను నెమరు వేసుకోటానికి ఈ జ్ఞాపకాలు చాలు ఈ మది గదికి
మెరుపు క్షణమే అయినా వచ్చే వెలుగు కళ్ళని కమ్మేస్తుందని తెలుసా నీకు

13, ఏప్రిల్ 2009, సోమవారం

ఎందుకిలా నా మీద నీ కోపం

ఎందుకలా నామీద నీ కోపం
ఎందుకిలా నా మీద నీ కోపం
నన్ను మాట్లాడవద్దనే కోపం
పలకరించొద్దనే అంతటి అలక
నిజం చెప్పు ఈ సాయంత్రం నువ్వు
ఇంటికి వెళ్ళే దారిలొ నిన్ను తడిమిన
నా జ్ఞాపకాలను మరవ గలవా

నీ పిచ్చి గానీ నన్ను నా మాటలను
నిను వెంటాడే నా ఊసులను నీ వెంటే
నేను ఏనాడో ఉంచేసాను ఇక నీ చూపు
నీ మాట్లాడే కళ్ళు నన్ను ఎప్పుడూ
వదలక వెంటాడుతూ వున్నాయి

నీకు నన్ను వెతకాలనే ఆలోచన
నా మదిని తడిమి ఓ సారి నీ
తియ్యటి ముద్ర వుందో లేదో అనే
ఆలోచనని నీ లోనే వుంచుకో

ఎప్పుడో చెప్పాను నువ్వు నా
లోతైన మది గదిలో బందీవని
నా మది గది తలపుల తాళం
నీ దగ్గరే వుందనీ అది పలికే రాగం
నీ మదికే తెలుసనీ నీ పలుకే నా
వెలుగనీ అది లేక పొతే నా మది
గదిలో అంతా చీకటనీ అయినా
నీకు మనసెలా ఒప్పింది ఈ మూగ
మనసుని శిక్షించాలని గదిని మూయాలని

పెదవి దాటని పదాలన్నీ నీ మది లోపల పదిలంగా పేర్చుకో

నీకు నా ఆలోచనలు వింతగా వుంటే నా ఊహలని నీ లోనే దాచుకో
రేపు ఉదయం నన్ను ఎప్పుడు చూడాలా అనే ఊహని నీ లోనే ఉంచుకో
పెదవి దాటని పదాలన్నీ నీ మది లోపల పదిలంగా పేర్చుకో
నీకు తీరిక దొరికాక ఒకటొకటే బయటకు తీసి పదాల మధ్యన
నీ ఊహల చిక్కులను తీసుకొంటూ కాలం గడుపు కానీ
నీ పంతాన్ని నెగ్గించుకొని నాతో మటుకు మౌనం గానే వుండు
నీ మౌనమే గెలుస్తుందో నా ఊహలే జయిస్తాయో చూద్దాం

నిజం చెప్పు నువ్వు వుండగలవా అంతటి మౌనంతో
నీ గజిబిజి ఆలోచనలన్నీ నాగూర్చే అని నాకు
తెలిసిపోతుందన్న పంతం తప్ప ఏముందిక్కడ