28, జులై 2009, మంగళవారం

కలలు మాత్రం నాకు మిగిల్చిన కళ్ళు....

ఆలోచింప చేసే కళ్ళు
మాట్లాడే కళ్ళు
అలా
అలవోకగా నవ్వే కళ్ళు
రెప్పలల్లార్చి ప్రశ్నించే కళ్ళు
ముద్దొచ్చే ముచ్చటైన కళ్ళు
ఆశ్చర్యంగా నన్ను పలకరించి
ఏమీ ఎరగనట్టు రెప్ప దించిన కళ్ళు
నలుగురిలో నన్నే వెదికే కళ్ళు
రా రమ్మని కైపెక్కించే కళ్ళు
సిగ్గుతో అరమోడ్పిన కళ్ళు
ఇవన్నీ నామీదకు వొదిలి ఏమీ
ఎరగనట్టు విచిత్రంగా
కలలు మాత్రం నాకు మిగిల్చిన కళ్ళు
సొగసరీ నీవు నిజంగా గడసరివని
చెప్పకనే చెప్పాయి నీ కళ్ళు

18, జులై 2009, శనివారం

నా గతిభ్రమణం

నాతో నీవూ నాలో నీవు అనుకున్నా
కానీ నిజానికి నేనెపుడూ నీలో నేనే
సాయంత్రాలు నీకోసం ఉదయాలు నీ కోసం
నిశిరేయి మాత్రం నీ జ్ఞాపకాల కోసం
ఇంతేలే ప్రతి నిమిషం నా గతిభ్రమణం
నాలోనే పరిభ్రమిస్తూ నిన్నే నింపుకుంటూ ...
నిన్న మనం పాడుకున్న మౌనగీతాల సవ్వడి
మనమనసులు మాత్రమే వినగలిగిన క్షణాలకోసం.....

15, జులై 2009, బుధవారం

నీ జ్ఞాపకాల వల

ఆకాశ౦లో నల్లని మబ్బులు చల్లని గాలిని పదేపదే
ముద్దాడుతూ మెరుపుల నవ్వులను విసురుతున్నాయి
నిదుర రాక నా కనురెప్పలు నీ పలకరింపుకోసం
చీకటి ఆకాశంలో వెతికాయి, తళుక్కుమన్నది నీవేమోనని
గడచిన కాలం ఘనీభవించి మరలా చినుకులా చిన్నగా
రాలకపొతుందా అనే ఆశ వేగంగా ఎటో కదిలిపోయింది
నిశ్శబ్దపు రాత్రిని నేనింకోసారి ఎవరికీ తెలియని
మరేవరికీ అందని దూర తీరాలకు తోసుకుపోదామనుకున్నా
నీ జ్ఞాపకాల వల నన్నూ, నాతో పెనవేసుకుపోయిన
మన అనుబంధాన్నీ మరొకసారి గుర్తుచేస్తూ బరువుగా వొంగింది

(ఆత్రేయ గారు అందించిన సూచన మేరకు ....కృతజ్ఞలతో )

13, జులై 2009, సోమవారం

అబద్దంతో నేను... నిజంతో నీవు ...

సాయంత్రం చూస్తూండగానే చీకటిగా మారి ఊహల ద్వారాలను తెరిచింది
కదిలే కాలం జ్ఞాపకాలను స్వప్నాలుగా మార్చి కనుల ముందు నిలిపింది
రెప్ప వెనకాల ఉబికిన నీటి చుక్క నిజాలవేడిని తట్టుకోలేక ఆవిరయ్యింది
నీ మౌనంతో పదునెక్కిన వలపుబాకు గాయాన్ని మిగిల్చి మాయమయ్యింది
కలసివున్న క్షణాలను మరిక కలవమేమోనన్న అనుమానం కరిగించింది !
అబద్దంతో నేను... నిజంతో నీవు ...ఎప్పటికీ కలవలేని జీవన సమాంతర రేఖలం
మనకిద్దరికే చెందిన ఓ లోకంలో కలవాలని ప్రయత్నించే వెర్రి బాటసారులం కాదా??

11, జులై 2009, శనివారం

కలిసి పంచుకుందాం

దూరాలను కొలిచే యంత్రాలను చూసా గానీ సృష్టించే తంత్రాలను నేనెరుగను
మనసులు కలిపే మాటలను విన్నాగానీ దూరమయ్యే తూటాలను ఎరుగను
కనులను కలిపే చూపులను ఎరుగుదును కానీ విడదీసే సైగలు తెలియదు
మన ఇద్దరి మధ్య దగ్గరితనాన్ని చూసా గానీ దూరాన్ని నే చూడలేను
అందుకే మనమిద్దరమూ పెదవులమాటున దాగిన నీ తీయని కలను
నా మదిలో దాగిన ఊసులను ఈ సాయంత్రం కలిసి పంచుకుందాం ప్రియా

7, జులై 2009, మంగళవారం

కలల బేహారి

కలకలమని నవ్వులను చుట్టూ పంచుతూ కలలెన్నో పెంచుతావు
కలతనిదురను మిగిల్చి నా చిన్ని ప్రపంచంలో అలజడి రేపుతావు
మౌనంగా వుంటూ వలపెరుగని మనసుకు మాటలెన్నో నేర్పుతావు
ఆగి మాట వినమన్నా నీ దారిన నువు కదలిపోతూంటావు
కరిగిపోతున్న కాలంలో నేనెక్కడున్నానో తెలుపుతూంటావు
గిరిగీసిన బతుకువృత్తంలో కలిసి మెరిసిన చిత్ర్రానివి నీవు
నా మనసునంతా సొంతం చేసుకున్న కలల బేహారివే కాదు
ఊహలన్నీ రాజేసిన నులి వెచ్చని పలవరింతవు నీవు ...నిజంగా!!