20, మే 2009, బుధవారం

నిజంలాంటి కలలోనో .... కలలాంటి నిజంలోనో

చిక్కటి చీకటిలో చల్లటి వాన పడుతున్నపుడు
చిరుసిగ్గులతో కలిసిన నులివెచ్చని మన ఊపిరి
మనమధ్య దూరాన్ని కరిగించాక మనమెవరో
తెలియని తన్మయత్వంలోకి మనం జారినప్పుడు
నిజంలాంటి కలలోనో కలలాంటి నిజంలోనో
మన మనసుల లోపల నిలిచిన చిత్రం చూసావా?
మబ్బుల మధ్య మెరుపులాగ తళుక్కుమంటోంది
అచ్చంగా మైమరపించే నీ తీయని నవ్వులాగా

మరొక వానజల్లు కోసం మనమిద్దరం వెదుకుదాం
క్షణ కాలం మెరిసిన మెరుపుల కాంతుల మధ్య
కరిగిన కాలం మిగిల్చిన తియ్యని జ్ఞాపకాలని
కలిసి పట్టుకుందాం కొత్త కలల నారు కోసం

16, మే 2009, శనివారం

నీ ఒడి కోరిన క్షణాన

నేనీ ఉదయం నీ పసిడి కాంతులని నీ జిలుగు వెలుగులను
నీ ముద్దులలొలికే సిగ్గుల బుగ్గలను నీ పెదాల దాగిన
తీయని నీ మాటలను నన్ను తాకనివ్వలేదని
నన్నూ నా మనసునీ సుఖాల తీరం వరకూ అలవోకగా
వెళ్దామని నీవు పిలిచే వరకూ నేను నిన్ను చూడలేదని
నీ నవ్వుల సందడి నే వినలేదనీ నువ్వు చిన్నబుచ్చుకోకు
నేను నా ఆలోచనల సుడిగుండంలో ముణిగానని
జీవనపోరాటంలో నేను విధినెదిరిస్తున్నాని నీకు చెప్పి
సేద తీరదామని నీ ఒడి కోరిన క్షణాన మన్నించవా ప్రియతమా

14, మే 2009, గురువారం

నిన్న రాత్రి

మనసులో భావలన్నీ ఎదుటపరచాలని ఉన్నా
తెలిపితే నువ్వేమనుకుంటావోననీ ఓ మూల భయం
నీకు కూడా అలానే ఉన్నదన్న నిజం తెలిసాక కలిగిన
తీయని మధురిమ నీతో నే గడిపిన క్షణాలను మరీ మరీ
గుర్తుచేస్తూ నా పక్కన నీవు వుండాలనే ఆలోచన కళ్ళువిప్పుతోంది
రెప్పమాటున దాగిన కలలను తనతో తీసుకువస్తూ
నీవు మాత్రం అందని దూరంలో ఉండిపోయి నా పెదవులపై
నిన్న రాత్రి నీవుంచిన వెచ్చదనాన్ని నాకు మిగిల్చావు

10, మే 2009, ఆదివారం

నీ కనురెప్పల మీద నిద్ర

నేను నీకు ఈ రాత్రి గుర్తురావడం ఎందుకనో తెలుసా
మన మనసులు ప్రతిక్షణం ఒకటేననీ నేను అంటే
నిన్న సాయంత్రం నువ్వునవ్వావు అవునా అంటూ
ఈ పున్నమి చంద్రుడు నీకూ నాకూ వెన్నెల ముద్దులు
పువ్వుల పుప్పొడితో కలిపి పంచాడు తన తీయని వెలుగుల్లో
ఆ జ్ఞాపకాల పొదరింట్లోని మన గుసగుసలని మరోసారి
నీకు గుర్తుచేసి తను మటుకు ఓ మబ్బుని వెదుక్కొని
అమాయకంగా నీ కనురెప్పల మీద నిద్ర నీడను పరిచాడు
అందుకే నేను నీ కలలోకి వెన్నల వన్నెలని, నవ్వుల పువ్వులనీ
ఏరుకొని నీ అందాలను వెతుకుతూ మెల మెల్లగా ఇమిడిపోతా

7, మే 2009, గురువారం

నీవు మళ్ళీ ఇలాగే...

నీవెందుకు నా నిద్రను దూరం చేసి కలలను కాజేసావు
రేపు వుదయం మటుకు నాకేమీ తెలియదే అంటావు
ఇదేమిటని నే అడిగినా నాకేసి ఓ నవ్వు విసుర్తావు
నాకు తెలుసు నీవు మళ్ళీ ఇలాగే నా మనసుతో రేపు
ఇంకో కొత్త ఆట మొదలుపెడతావు మరొక కలను కాజేసి
నా కనురెప్పల వెనుక వున్న నీ తీయని ముద్దును తీసి

6, మే 2009, బుధవారం

కాలం ఆవిరైపోతూ

నా ఎదపై నీ తలవుంచి
నా గుండె చప్పుడు విని చూడు
పలుకుతున్న నీ గొంతే వినిపిస్తుంది
ఎదురుగా అద్దం లోకి చూడు
నీ కను పాపల వెనుక మనమిద్దరం
కన్న కలలన్నీ కదుల్తాయి
నీవు ఒంటరిగా ఉన్నపుడు
నా మాటలే నిన్ను పదే పదే పలకరిస్తాయి
మనమిద్దరం కలసి పంచుకున్న కాలం ఆవిరైపోతూ
నీకూ నాకూ మధ్య తరగని దూరాన్ని
కరిగించాలని తపనగా తనవంతుగా
కొత్త గమనాలను సరికొత్త గమ్యాలను
చూపి నెమ్మదిగా మాయమయ్యింది
నేను మాత్రం నిన్న నీవు వొదిలిన జ్ఞాపకాల మధ్య
నీ నవ్వులను ఏరుకొంటూ తప్పిపోయాను

5, మే 2009, మంగళవారం

ఓ లేత మొగ్గ

నిన్న వెన్నెల నీడలలో నువ్వు సిగ్గుపడి మరచిన
ఓ లేత మొగ్గ నా దగ్గరే వుంది వయ్యారంగా వగలుపోతూ
చటుక్కున మెరుపులా నీ పెదవి మీద మెరిసిన నవ్వులాగా
తెలియని మత్తుని నా మదికందించి నెమ్మదిగా రెప్పలు
విప్పార్చి విచ్చుకుంటోంది ఏమీ ఎరుగనని చెప్పే నీ
నులివెచ్చని చూపుల స్పర్శ పలకరించినట్టే అచ్చంగా

ఎందుకనీ?

నిన్ను కలిసిన క్షణాల కన్నా కలుస్తానని ఎదుర్చూసిన
క్షణాలే మురిపిస్తున్నాయి ఎందుకనీ? నువ్వు మాట్లాడేటప్పుడు
నాకు నీ నవ్వే వినిపిస్తుందెందుకనీ? ప్రతి నిముషం నీ కళ్ళే
నాతో ఊసులాడుతున్నాయి ఎందుకనీ? నీవెక్కడున్నా నా
తలపులు నీ వెంటే వున్నాయందుకు? ఏమో మరి!! అనుక్షణం
మన మనసులు మన ప్రమేయం లేకనే కలసి వున్నందుకా?

3, మే 2009, ఆదివారం

నిజంగా ...నీ తోడు కావాలి

మన మనసుల మధ్య కలలు అన్నీ పరిమళాల పలకరింపులే
నీ కల వేరయినా అది నా మనసుని పట్టేసింది
ఇప్పుడు చెప్పు నువ్వూ నేనూ వేరుకాదనీ కానీ
మనినిద్దరినీ వేరు చేసింది మన మధ్య ఉన్న
కనిపించని మసక బారిన ఈ లోకపు పాత ధోరణనీ

నీవు లేని సాయంత్రం

నా సంతోషపు సంద్రంలో నీ నవ్వుల అలలు
ఎందుకనో మాయమయ్యాయి! బహుశా నీ కలలున్నాయని కాబోలు!!
మన ఇద్దరి మధ్యా దూరాన్ని క్షణాలతొ కొలుద్దామని కాలం
తన గాలం సిద్దం చేసింది తనకు తెలియని సంకెలలని తడిమి
నీవు నాతో లేవని, మరిక రావనీ ,నీ తలపే నన్ను వెదికిందనీ
మరి ఈ నిజం నన్ను అనుక్షణం నిప్పులా జ్వలిస్తోందని నీకు తెలుసా !!!