29, జూన్ 2009, సోమవారం

ఎదురుచూసేది దేనికోసం ?

ప్రతి సాయంత్రం మన కలయిక కోసం కలవరిస్తానెందుకో
రోజంతా ఆగని ఆలోచనల మధ్య నీ కోసం వెతుకుంటానలా
ప్రతీక్షణం నువ్వేమి చేస్తూంటావోననే ఆలోచన ఆగని అలల్లా
మనమిద్దరమే ఉన్నపుడు మాత్రం పదాలు ఏవీ అర్ధం కావు నీలా
నీవు దగ్గరయ్యే కొద్దీ మళ్ళీ దూరమవుతామేమోనని భయం
అలాగని దూరమయ్యేకొద్దీ నేనుండలేననే నిజం ఇంకా భయం
నిజం చెప్పు నువ్వూ నేనూ ఎదురుచూసేది దేనికోసం ??
చుట్టూ ఎవరూ లేని మనకే చెందిన కాలం కోసం కాదా??

28, జూన్ 2009, ఆదివారం

నా మనసుని పలకరించావు

ఈ సాయంత్రం నువ్వు దూరంగా ఉండి నా మనసుని పలకరించావు
నిన్న మాత్రం దగ్గరగా వచ్చి గలగలమని పరుగెత్తే పదానివై కదలిపోయావు
నా మనసుని అనుక్షణం ఎనలేని జ్ఞాపకాల దొంతరతో ముంచివేసావు
కరిగి పోయిన కాలం మన మధ్య మిగిల్చిన స్వప్నాలను వెదుకుతున్నాను
రేపేనాడైనా వెనుతిరిగి చూసినపుడు నాకిస్తావేమోనని ఎదురుచూస్తున్నాను
జీవన గమనపు పరుగులో నీకూ నాకూ అంతటి తీరిక ఉన్నదా అసలు?

15, జూన్ 2009, సోమవారం

తోడుగా వస్తావుగా ప్రియతమా!!

పరిగెట్టే కాలానికి గాలం వేస్తూ
మనకిద్దరికే తెలిసిన సంగతుల్ని మళ్ళీ పట్టుకుందాం
కలబోసుకున్న క్షణాలను వెతికి తీద్దాం
మరి రాత్రికి తోడుగా వస్తావుగా ప్రియతమా!!



(ఆత్రేయ గారికి కృతజ్ఞతలతో )

13, జూన్ 2009, శనివారం

చిరునవ్వు విసిరావు అచ్చం ఆ జాబిలిలా ...

ఎందుకనీ నే నీతో గడిపిన క్షణాలన్నీ ఒకటొకటే నా ఎదురుగా
నిలబడి మనకు మాత్రమే తెలిసిన రహస్యాలని గుర్తుచేస్తున్నాయి?

కుదురుగా నేనీవేళ కూచుని నెమరు వేసుకుంటే తెలిసింది
నీవు నా ఎద మీద ఒదిగి నా మది చప్పుడు విని కిలకిలమని
మరొకసారి గుండె పై చేయి వేసి నీ మాటల అలికిడి విని
నిజమా అని ఏమీ తెలియనట్టు నీ కళ్ళని రెపరెపలాడించి
నా గుప్పెడు గుండెను నీ గుప్పెటలో బంధించి మరిపించావని

అంతేనా! నవ్వుల జల్లులను కురిపించి నన్ను నిలువునా
కమ్ముకున్నావు పూల సుగంధంతో కలిసిన వెన్నెల వెలుగులా!!

తనివితీరని తీయని తలపులు నాకు మిగిల్చి నీవు మాత్రం
చిత్రమైన ఒక చిరునవ్వు విసిరావు అచ్చం ఆ జాబిలిలా ...

11, జూన్ 2009, గురువారం

అర్థం కాని బతుకు నుడికట్టులని పూరిస్తూ.....

నాకు తెలుసు ప్రియతమా ఏదో ఒక రోజు మనమిద్దరం మమేకం అయినప్పుడు
నీవు చేసిన మాయ నీకు తెలియదు కానీ నాకు మాత్రం తెలుస్తుంది
మనం పంచుకున్న మధురానుభూతులన్నిటినీ కలగలిపి
మనకందరికీ తెలిసిన పేర్లను నిర్ణయించమంటావని అనుకున్నా

నీకు నాకు ఇది ఒక కొత్త జన్మ అనుకుందామా? లేక
మనమిద్దరం రాబోయే జన్మ కోసం ఎదురుచూద్దామా?
మనం క్షణకాల జీవితంలో మెరుస్తున్న మెరుపులను సారి
దోసిటలో ఒడిసి పట్టుకుందామా?
తెలియని గమ్యాలను వెతుకుతూ అర్థం కాని
బతుకు నుడికట్టులని పూరిస్తూ రేపటి క్షణాలను
మన మధ్య తరిగే దూరానికి మైలురాళ్లుగా మారుద్దామా

మనసు లోపల తుఫాను

నీ నవ్వుతో వాలు చూపులను రంగరించి వాలుజడకు కలిపి
మీదకు వదిలి నా మనసు లోపల తుఫాను మెరుపులను
ఉవ్వెత్తున ఎగసిపడే కోరికల అలలను నువ్వు సృష్టిస్తే
పెదవి మాటున నా మాటలన్నీ కలలై నీ నిద్రను కాజేస్తాయి

6, జూన్ 2009, శనివారం

సొగసరివా .. గడసరివా...

నువ్వొక అందమైన అద్భుతానివి నా జీవితంలో
నువ్వలా నా పక్కనుండి చిరునవ్వుల వెలుగులో
మన ఎదురుగా వున్న నిజాలని లోతుగా చూపుతావు
కలల సారధివై ఓ కొత్త ప్రపంచాన్ని ముందు నిలుపుతావు
మనసుని తడిమి వింతగా నిద్రను దూరం చేస్తావు
నా ఆలోచనల అలలను చూసి అలవోకగా నవ్వుతావు
రహస్యంగా ముగ్ధమనోహరంగా కళ్ళతో పలకరిస్తావు
ప్రతి సాయంత్రం ఓ మల్లెల వసంతాన్ని మోసుకొస్తావు

3, జూన్ 2009, బుధవారం

నేనెపుడూ సమూహంలో ఒంటరిని

ఎన్నో రొజుల తరువాత నా ఊహల రెక్కలు విప్పి
నిన్ను వెతుకుతూ వచ్చి నీ ఒడిలో వాలాను
నీ నవ్వు కోసం, నీ పలుకు కోసం నే కలవరించాను
నా చిన్ని ప్రపంచం లోకి కొన్ని గంటల పాటు రమ్మన్నాను

నా చీకటి మనసులోకి నీవు అడుగిడగానే నీకు తెలుసా
నీవు నాకిచ్చిన వెలుగు ఎంతో గొప్పదని
నాకు నీ పట్ల వున్న ప్రేమను కొలవాలని నీవనుకున్నావు
నాకన్నా ఇంకెవరో నీకోసం నీ సహచర్యం కోసం
తపన పడుతున్నారనీ, నేనెవరో నాకు నన్ను గుర్తు చేసావు
నిజమే కదా నీవంటి అందమైన మనసు కోసం ఆరాట పడనిదెవరు
కేవలం నా పిచ్చి గానీ !! అందుకే నేనెపుడూ సమూహంలో ఒంటరిని