14, డిసెంబర్ 2012, శుక్రవారం

అవును నేను ఎపుడూ ఒంటరినే నిన్నా, నేడూ , రేపూ




ఇక సెలవు
నాతొ గడిపిన వెయ్యికి పైగా రోజులకు వందనం
ఈ అనంత కాల గమనంలో ఈ వెయ్యి రోజులూ అందించిన
వెలకట్టలేని జ్ఞాపకాలకు శతకోటి వందనాలు
నీ చలనవాణి నా కోసం వెదికినప్పుడు  ఇక అందను
నీ నుంచి శాశ్వతంగా విడిపోయాక నీకు ఏనాడైనా
నీ విరామంలో తీరిక దొరికెతే
కనుమరుగైన వెయ్యి రోజులను గుర్తు చేసుకో
నీకు వీలుంటే తీరికగా అడుగు


నా జ్ఞాపకాలు వదిలిన జాడలను
నేను కనిపించని  నెనర్ల ఆవిరిగా ఎందుకు మారానని 


ఇక సెలవు
అవును నేను ఎపుడూ ఒంటరినే నిన్నా, నేడూ , రేపూ

24, అక్టోబర్ 2012, బుధవారం

నీవు మళ్ళీ ఇలాగే...

నీవెందుకు నా నిద్రను దూరం చేసి కలలను కాజేసావు
రేపు వుదయం మటుకు నాకేమీ తెలియదే అంటావు
ఇదేమిటని నే అడిగినా నాకేసి ఓ నవ్వు విసుర్తావు
నాకు తెలుసు నీవు మళ్ళీ ఇలాగే నా మనసుతో రేపు
ఇంకో కొత్త ఆట మొదలుపెడతావు మరొక కలను కాజేసి
నా కనురెప్పల వెనుక వున్న నీ తీయని ముద్దును తీసి


ఎందుకో?

ఎందుకు నీకై నేను ఎదురుచూస్తాను
కనిపిస్తే అలా నీ మాట కోసం ఆగి వుంటాను
నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పాలని ఉన్నా
మాటలు రావు ఎందుకనీ?
నువ్వు కళ్ళు ఆర్పుతూ అవునా? అనంగానే
మనసు లో ఉన్న మాట మాయమై పొతున్నది ఎందుకో?
ఇక మనం కలవం అని తెలిసీ ఈ మనసు నీ కోసం
పదే పదే పలవరించేది మరెందుకో ?


నాడూ నేడూ ఒంటరినే

నేను ఒకప్పుడు ఒంటరిని
నువు కలిశాక అనుకొన్నాను
నేస్తం దొరికిందని కలిసే వుంటామని
మెరిసే సాయంత్రాలూ కలిసే ఉదయాలూ
మనిద్దరి సొంతమని అనుకొన్నాను

కానీ ఈ కదిలే కాలం ఇంత గొప్పదని అనుకోలేదు
జీవితం మనల్ని ఇలా విడతీస్తుందని
అందని తీరాలకి నెడుతుందనీ
ఎడబాటు ఇంత పదునైనదనీ
నా మనసు పైన కోతలు పడ్డాకే తెలిసింది
అవును నేను ఎపుడూ ఒంటరిని కదా
నేను సమూహంలో ఒంటరినే నాడూ నేడూ


23, జులై 2011, శనివారం

కలలను నెమరువేస్తూ

కలలను నెమరువేస్తూ నేను నీ కోసం నిరంతరం
ఏరోజైనా నీ  చూపు కలవకపోతుందా అని అలా అలా
ఎదురుచూస్తూ నిన్నా రేపూ మరేనాడూ నీకోసం 
అలాగే పలవరిస్తూ , ఈ జన్మలో మిగిలిందేమీ లేదు
మరోజన్మ ఉందో లేదో తెలియదు అనుకున్నా ..........
మనసు చాటున నీవు చేసిన బాసలు వెక్కిరిస్తున్నాయి  
నిద్రను ప్రతిదినం దూరం చేస్తున్నాయి నీవు ముద్దాడిన క్షణాలను
మళ్ళీ మళ్ళీ కలవరిస్తూ నేను ప్రతి వారంలో నీ కోసం వేచివుంటా  

20, మే 2011, శుక్రవారం

వసంతం మూగ పోయింది

మల్లెలు మోసుకు వచ్చే వసంతం మూగ పోయింది
కలలను తీసుకు వచ్చే తరంగం తగ్గి పోయింది
తడిమి చూసినా తగలని సుగంధం దూరమైంది
నేను  మాత్రం అప్పుడూ ఎప్పుడూ అలాగే
నీకోసం నిశి రాత్రి నిద్రను కాదని పలవరిస్తూ
నీ మాటలను తలుచుకుంటూ మరో కలని
నిజం కాదని తెలిసీ కలవరిస్తూ ఎదురు చూస్తా

--
నాలో నేను
---సమూహం లో ఒంటరిని

3, డిసెంబర్ 2009, గురువారం

చీకటి తెరలని రచించిందెవరో ???

నువ్వు నా జ్ఞాపకాలనుంచి, నా నుంచి తప్పుకోవాలని అనుకున్నా
నీకు తెలిసిన మనసును అడిగి చూడు నీడలా నీ వెంటే వున్నది ఎవరని?
అలిగి అలసిన మాటలనడుగు నీ ఊహల వెనుక ఉన్న ఆశేమిటో
నిజానికి అబద్ధానికి మధ్య నా కలలనీ ఊహలనీ తొక్కిపెట్టిందెవరో

మన ఇద్దరి మధ్య అలుముకున్న చీకటి తెరలని రచించిందెవరో
కనిపించని నిజాలనడుగు అబద్దపు నీడల పొడుగేమిటో
కాలచక్రం ఇరుసులనడుగు కదలిపోయిన కలల కన్నీరు ఏమిటో
నిద్ర రాని నా కన్నులనడుగు నీకు నేనేమిటో

అలా అలవోకగా ఓటమి నన్ను ఓడిస్తూంటే
నిజాల వెంట నీవు ఊహల మధ్య నేను ............
ఎప్పటికీ ఒంటరిగా అదే దిక్కుతోచని సమూహంలో
అయినా! నేనింతకు ముందూ ఒంటరినే ఇక పైనా కూడా ........................

31, అక్టోబర్ 2009, శనివారం

నీకో నిజం తెలుసా?

నాతో నువ్వున్న క్షణాలను నిర్ధాక్షిణ్యంగా మింగేసిందీ కాలం
ఒంటరిగా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే తడిమిందో గాయం

రెక్కలు తొడిగిన వూహలన్నీ వెచ్చని కలలుగా మారి
నీ సహచర్యం కోసం ఎన్నాళ్ళు గానో ఎదురు చూస్తున్నాయి

నిను మెచ్చిన వాళ్ళెందరో కదా
నేను వాళ్ళందరిలో చివరెక్కడో

నీకో నిజం తెలుసా!!

కరిగి పోయిన కాలాన్ని అడుగు,తొక్కిపెట్టిన నీ ఊహలను
మన చేతుల మధ్య జారిపోయిన ఊసులను అడుగు
నీ మనసు చాటున అదిమి ఉంచిన నా తీపిగుర్తులు
అలా తెరలు తెరలుగా నిన్ను ఉప్పెనగా ముంచెత్తుతాయి

నేనెదురు చూసినా ....

ప్రతి సాయంత్రం నీ గూర్చి తపిస్తానెందుకని?
ప్రతి ఉదయం నీ పలుకు కోసం పలవరిస్తానెందుకు?
మనసు నాతో లెకుండా నీ వెనుకే పరిగెడుతెందుకని?

ఎన్నాళ్ళ నించో నీ కోసం నేనెదురు చూసినా
తీరా పలకిరించే సరికి అలుగుతావెందుకనీ?

నీ చుట్టూ నా ఆలోచనలు వున్నాయని తెలిసీ
నువ్వు నా నుంచి దూరంగా కదిలిపోతావెందుకనీ ?

15, అక్టోబర్ 2009, గురువారం

వెలితి పోయింది

నిన్నటి దాకా నన్ను చుట్టుముట్టిన వెలితి
ఇవాళ ఉదయం మాయమై ఒక మార్పునిచ్చింది
నువు కనిపించగానే తెలియని ఆనందం విచ్చింది

ప్రతి సాయంత్రం వచ్చే మల్లెల వసంతం మళ్ళీ
నీ నవ్వుల పరిమళాల్తో సిధ్దమైమవుతుందని
తెలియక నేనింకా కలల్లోనే ఇలా ఉండిపోయాను

24, సెప్టెంబర్ 2009, గురువారం

నేను నీకేమవుతానని!!

నీ కన్నులు నన్నీరోజు వెతకలేదని నాకు తెలుసు
నీ పలుకు కోసం నిరంతరం పలవరిస్తూంటానని తెలిసీ
పని పూర్తి చేసుకున్న సూర్యుడిలా అలా సాగిపోయావు
నీవు లేని సాయంత్రాలను నాకు కొత్తగా పరిచయం చేసావు
నీకు తెలియని నిజం మాత్రం నా దగ్గరే పదిలంగా వుంది
రెప్పలు మూతపడని నిద్ర తెలియని కలలు మాత్రం నావి
కనిపించిన క్షణంలోనే కలిగించే తీయని బాధ గా నిలిచావు

నిజం చెప్పు
నేను నీకేమవుతానని!!
నాకు తెలుసు నీకు తెలియక పోయినా
నీకు తెలియని నీ నీడను
ఎప్పుడో గుర్తొచ్చే కాలం ఇచ్చిన
తీయని మరిపించిన గుర్తుని!!
నేను నాకూ నీకూ తెలియని ఒక మాయని

16, సెప్టెంబర్ 2009, బుధవారం

నేనీ రాత్రి ఒంటరిగా నీ నవ్వులను వెదుకుతూ

నిరుడు నీవెక్కడ.... నేనెక్కడ.....
కలలో అయీనా అనుకోలేదే ఎదురొస్తావని
విధి కాలంతో కలిసి ఒక్కటై మునుపెన్నడూ
ఎరుగని సంతోషాన్నీ భాధనీ నవ్వులనీ
ముప్పేటగా చేసి నన్ను ఊపిరాడనివ్వక
అనుక్షణం నీగూర్చి నా మదిని మెలిపెడుతూ
నిద్రని దూరం చేసి కళ్ళని కలవరపెడుతున్నది
నిజానికి ... అబద్ధానికి మధ్య ఉన్నది గోడలాంటి కల

నవ్వులు నింపుకున్న నీ కళ్ళు

నవ్వులు నింపుకున్న నీ కళ్ళు విసిరే చూపుల మాటున
కనీ కనిపించని మెరుపులన్నీ నన్ను కమ్ముకున్నాయి
లేని కోపంతో ఎరుపెక్కిన నీ పెదాలు ముచ్చటగా కదిలి
నీకోసం ఎదురుచూసిన నా పైకి ముత్యాలను విసిరాయి
మరో క్షణంలో ఏమెరగనట్టు నింపాదిగా కదిలిపోయావు
రాలిన ముత్యాల సరాలని ఏరుకుంటూ
కలల సంద్రంలోకి
జ్ఞాపకాల సుడిగుండంలోకి
ఒంటరిగా...నేను

23, ఆగస్టు 2009, ఆదివారం

పెదవి పై నీవు అద్దిన మకరందం

ఈ సాయంత్రం .......
నీవు నాతో గడిపిన కాలం
ఇచ్చింది మరపు రాని
మత్తెకించే మధుర మైన దగ్గరితనం
పెదవి పై నీవు అద్దిన మకరందం ఆరకుండా
తడిమి తడిమి పదే పదే తీపిని గుర్తు చేస్తూ
నా నిద్దురను దూరం చేసింది
ఎదురుగా నిలిచి
చేదుగా మిగిలిన నిజాలని
నామీదకు వదిలి
తను మాత్రం చీకటి లోకి జారుకుంది

12, ఆగస్టు 2009, బుధవారం

నవ్వుతావెందుకూ ..?

వెతికాను ఈ రోజు కూడా ...
ఇక్కడా అక్కడా
నీడలు కమ్మిన ప్రపంచంలో
వెలుగును ఇముడ్చుకున్న నీకోసం
నాలోనూ నా కదలికలోనూ....
కాలం మింగిన క్షణాలలోనూ
నీకూ నాకూ మాత్రమే తెలిసిన
మనదైన మరువలేని ఏకాంతం లోనూ
నీ చుట్టూ నేను రాలేని నిలువెత్తైన గడ్డుగోడలు
మనుషుల మర్మాలను గుర్తుచేస్తూ కనిపించని తెరలు
నేనేమో నిత్యం నలుగుతున్న బతుకు నిజాల మధ్య
నువ్వేమో అలుపెరుగని జీవన చట్రాల మధ్య
నీకోసం నేనూ నాకోసం నువ్వూ .......
అసలుగా మనకోసం మనమిద్దరిమే అనేది
అందరాని అందమైన రంగుల స్వప్న జగత్తు
మన జీవితాల మధ్య ఏనాటికీ వెలవని ఇంధ్రధనుస్సు
అటు నీవూ ఇటు నేనూ ....
ఒడ్డుకి అటు ఇటూ .....
అలలు కలలూ ఇద్దరివీ అని నేనంటే నవ్వుతావెందుకూ

28, జులై 2009, మంగళవారం

కలలు మాత్రం నాకు మిగిల్చిన కళ్ళు....

ఆలోచింప చేసే కళ్ళు
మాట్లాడే కళ్ళు
అలా
అలవోకగా నవ్వే కళ్ళు
రెప్పలల్లార్చి ప్రశ్నించే కళ్ళు
ముద్దొచ్చే ముచ్చటైన కళ్ళు
ఆశ్చర్యంగా నన్ను పలకరించి
ఏమీ ఎరగనట్టు రెప్ప దించిన కళ్ళు
నలుగురిలో నన్నే వెదికే కళ్ళు
రా రమ్మని కైపెక్కించే కళ్ళు
సిగ్గుతో అరమోడ్పిన కళ్ళు
ఇవన్నీ నామీదకు వొదిలి ఏమీ
ఎరగనట్టు విచిత్రంగా
కలలు మాత్రం నాకు మిగిల్చిన కళ్ళు
సొగసరీ నీవు నిజంగా గడసరివని
చెప్పకనే చెప్పాయి నీ కళ్ళు

18, జులై 2009, శనివారం

నా గతిభ్రమణం

నాతో నీవూ నాలో నీవు అనుకున్నా
కానీ నిజానికి నేనెపుడూ నీలో నేనే
సాయంత్రాలు నీకోసం ఉదయాలు నీ కోసం
నిశిరేయి మాత్రం నీ జ్ఞాపకాల కోసం
ఇంతేలే ప్రతి నిమిషం నా గతిభ్రమణం
నాలోనే పరిభ్రమిస్తూ నిన్నే నింపుకుంటూ ...
నిన్న మనం పాడుకున్న మౌనగీతాల సవ్వడి
మనమనసులు మాత్రమే వినగలిగిన క్షణాలకోసం.....

15, జులై 2009, బుధవారం

నీ జ్ఞాపకాల వల

ఆకాశ౦లో నల్లని మబ్బులు చల్లని గాలిని పదేపదే
ముద్దాడుతూ మెరుపుల నవ్వులను విసురుతున్నాయి
నిదుర రాక నా కనురెప్పలు నీ పలకరింపుకోసం
చీకటి ఆకాశంలో వెతికాయి, తళుక్కుమన్నది నీవేమోనని
గడచిన కాలం ఘనీభవించి మరలా చినుకులా చిన్నగా
రాలకపొతుందా అనే ఆశ వేగంగా ఎటో కదిలిపోయింది
నిశ్శబ్దపు రాత్రిని నేనింకోసారి ఎవరికీ తెలియని
మరేవరికీ అందని దూర తీరాలకు తోసుకుపోదామనుకున్నా
నీ జ్ఞాపకాల వల నన్నూ, నాతో పెనవేసుకుపోయిన
మన అనుబంధాన్నీ మరొకసారి గుర్తుచేస్తూ బరువుగా వొంగింది

(ఆత్రేయ గారు అందించిన సూచన మేరకు ....కృతజ్ఞలతో )

13, జులై 2009, సోమవారం

అబద్దంతో నేను... నిజంతో నీవు ...

సాయంత్రం చూస్తూండగానే చీకటిగా మారి ఊహల ద్వారాలను తెరిచింది
కదిలే కాలం జ్ఞాపకాలను స్వప్నాలుగా మార్చి కనుల ముందు నిలిపింది
రెప్ప వెనకాల ఉబికిన నీటి చుక్క నిజాలవేడిని తట్టుకోలేక ఆవిరయ్యింది
నీ మౌనంతో పదునెక్కిన వలపుబాకు గాయాన్ని మిగిల్చి మాయమయ్యింది
కలసివున్న క్షణాలను మరిక కలవమేమోనన్న అనుమానం కరిగించింది !
అబద్దంతో నేను... నిజంతో నీవు ...ఎప్పటికీ కలవలేని జీవన సమాంతర రేఖలం
మనకిద్దరికే చెందిన ఓ లోకంలో కలవాలని ప్రయత్నించే వెర్రి బాటసారులం కాదా??

11, జులై 2009, శనివారం

కలిసి పంచుకుందాం

దూరాలను కొలిచే యంత్రాలను చూసా గానీ సృష్టించే తంత్రాలను నేనెరుగను
మనసులు కలిపే మాటలను విన్నాగానీ దూరమయ్యే తూటాలను ఎరుగను
కనులను కలిపే చూపులను ఎరుగుదును కానీ విడదీసే సైగలు తెలియదు
మన ఇద్దరి మధ్య దగ్గరితనాన్ని చూసా గానీ దూరాన్ని నే చూడలేను
అందుకే మనమిద్దరమూ పెదవులమాటున దాగిన నీ తీయని కలను
నా మదిలో దాగిన ఊసులను ఈ సాయంత్రం కలిసి పంచుకుందాం ప్రియా